బడుగులకు ఈటల చేసిందేమిటి? బాల్క సుమన్

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, టిఆర్ఎస్‌ నేతల మద్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బహుశః ఎప్పటికీ కొనసాగుతూనే ఉండవచ్చు కూడా. తాజాగా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే, విప్ బాల్కా సుమన్ గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బడుగుబలహీనవర్గాల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ అసలు వారికి ఏమి మేలు చేశారో చెప్పగలరా? హుజూరాబాద్‌లో 3,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను సిఎం కేసీఆర్‌ మంజూరు చేస్తే వాటిపై శ్రద్ద పెట్టకుండా హైదరాబాద్‌లో 5 ఎకరాలలో విలాసవంతమైన ఇంద్రభవనం వంటి ఇల్లు నిర్మించుకొన్నారు.

సిఎం కేసీఆర్‌ ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యం ఇచ్చి గౌరవించినప్పటికీ ఆయన దానిని నిలబెట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలు అమలుచేస్తూ ప్రజల గుండెల్లో కొలువైన సిఎం కేసీఆర్‌ గురించి ఈటల రాజేందర్‌ అవాకులు చవాకులు మాట్లాడటం సరికాదు. ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన విదంగా బుద్ది చెపుతారు. ఇదివరకు ఏ బిజెపిని తీవ్రంగా విమర్శించారో అదే పార్టీలో చేరారు. దీనిని బట్టి ఆయనకు ఆశయాలు, సిద్దాంతాలు లేవని, తన ఆస్తులు కాపాడుకోవడమే ముఖ్యమని స్పష్టం అయ్యింది,” అని అన్నారు.