తెలంగాణలో ఇప్పటివరకు 97 లక్షల మందికి టీకాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 97 లక్షల మందికి కరోనా టీకాలు వేశాము. వారిలో 83 లక్షల మందికి మొదటి డోస్‌ ఇవ్వగా మిగిలినవారికి రెండు డోసులు వేశాము. రాష్ట్రంలో ఇంకా 2.2 కోట్ల మందికి టీకాలు వేయవలసి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 టీకా కేంద్రాలు, 24 మొబైల్ వాహనాల ద్వారా రోజుకి 1,500 మందికి పైగా టీకాలు వేస్తున్నాము. బుదవారం నుంచి 30 ఏళ్ళు పైబడినవారికి టీకాలు వేయడం ప్రారంభించాము. వచ్చే నెలలో సుమారు 21 లక్షల డోసుల టీకాలు రాష్ట్రానికి వస్తాయి. 

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు టీకాలు వేసే కార్యక్రమం మొదలుపెట్టాము. వారు తమ ఐడీ కార్డులు చూపినా టీకాలు వేస్తారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత బాగా తగ్గింది. రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క డెల్టా ప్లస్ వైరస్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అది తెలంగాణ రాష్ట్రంలో వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాము. ఒకవేళ ప్రవేశించినా దానినీ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు.