మరియమ్మ మృతిపై జ్యూడీషియల్ విచారణ

ఈ నెల 18వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ అనే మహిళ అనుమానాస్పద మృతిపై హైకోర్టు జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది. ఆమె మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం కూడా నిర్వహించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 

ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని కోమట్లగూడ గ్రామానికి చెందిన దళిత మహిళ మరియమ్మ. ఆమె పనిచేస్తున్నచోట దొంగతనం చేసిందనే ఆరోపణతో అడ్డగూడూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జూన్‌కు 17వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పోలీస్ కస్టడీలో ఉండగా ఆమె చనిపోయింది. పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టడంతో ఆమె చనిపోయిందని బందువులు ఆరోపిస్తుండగా, ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగానే స్పృహ తప్పి పడిపోయిందని వెంటనే తాము ఆమెను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో గుండెపోటుతో చనిపోయిందని పోలీసులు వాదిస్తున్నారు. 

ఆమె మృతిపై దాఖలైన ఓ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తం చేసి జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసి రాచకొండ సిపీకి నోటీస్ పంపించింది. ఈనెల 23లోగా ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.