
రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గినందున జూలై 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుదవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.
త్వరలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, దానిలో ప్రధానంగా చిన్నపిల్లలకే సోకుతుందని నిత్యం వార్తలు, హెచ్చరికలు వినిపిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం జూలై 1 నుంచి పాఠశాలలు తెరవాలనుకోవడం అనాలోచితం కాదా? పెద్దవారే కరోనా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నప్పుడు చిన్న పిల్లల చేత కరోనా జాగ్రత్తలు పాటింపజేయడం సాధ్యమేనా? రాష్ట్రంలో చాలా పాఠశాలలో చిన్నచిన్న ఇరుకు గదులున్నాయి. వాటిలో చిన్నారులను కూర్చోబెట్టి పాఠాలు చెపితే ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది కదా?పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష పద్దతిలో తరగతులు భోదించాలనుకొంటున్నప్పుడు విద్యార్దుల తల్లితండ్రుల అభిప్రాయాలను, వారి భయాందోళనల గురించి తెలుసుకొన్నారా?అసలు దీని కోసం ప్రభుత్వం ఎటువంటి విధివిధానాలు రూపొందించింది?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
హైకోర్టు ప్రశ్నలపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ, విద్యార్దులు తప్పనిసరిగా పాఠశాలలకు వచ్చి తరగతులకు హాజరుకానవసరం లేదని ఆన్లైన్లో తరగతులకు హాజరైనా పర్వాలేదన్నారు. పాఠశాలల పునః ప్రారంభించేందుకు అవసరమైన విధివిధానాలను త్వరలోనే రూపొందించి హైకోర్టుకు నివేదిస్తామని చెప్పగా ఎక్కడైనా ముందుగా విధివిధానాలు రూపొందించుకొని తరువాత నిర్ణయం తీసుకొంటారు. కానీ ప్రభుత్వం ముందుగా పాఠశాలలు తెరవలని నిర్ణయం తీసుకొన్నాక విధివిధానాలు రూపొందించుకొంటామని చెపుతుండటం హాస్యాస్పదంగా ఉందని హైకోర్టు ఆక్షేపించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.