
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లిలో కేసీఆర్ నగర్లో నిర్మించిన 1,024 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు దక్కాల్సిన 40,000 క్యూసెక్కుల నీటిని ఆంధ్రాకు తరలించుకుపోగా, ఇప్పుడు ఆయన కుమారుడు ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పధకం చేపట్టి ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వారా మన నీటిని తరలించుకుపోతున్నారు. నీళ్ళ దొంగతనంలో తండ్రి వైఎస్ దొంగ అయితే...కొడుకు గజదొంగ. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం,” అని అన్నారు.
ఆనాడు వైఎస్ ఏపీకి నీటిని తరలించుకుపోతుంటే జిల్లాకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్ నేత ఆయనకు హారతులు ఇచ్చారని, ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే విమర్శిస్తున్నారని మంత్రులు వేముల, శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.