ఆగస్ట్ నుంచి తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో పాదయాత్ర

ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార టిఆర్ఎస్‌ పార్టీకి చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న వచ్చే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఏడాది ఆగస్ట్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఆయన బృందంలోని సభ్యుడు పందిరి భూమన్న మంగళవారం మీడియాకు ఈవిషయం తెలియజేశారు. ఈ పాదయాత్ర ప్రధానంగా రాష్ట్రంలో కబ్జాకు గురైన భూములున్న ప్రాంతాల మీదుగా సాగుతుందని చెప్పారు. అధికార టిఆర్ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధుల భూకబ్జాలను ఈ పాదయాత్రలో బయటపెట్టి నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసి భయబ్రాంతులను చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి చేత సిఎం కేసీఆర్‌ కాళ్ళు మొక్కించుకోవడం సిగ్గుచేటని పందిరి భూమన్న ఆక్షేపించారు.