త్వరలోనే మామునూర్‌కి విమానాశ్రయం:కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ నిన్న వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేసిన తరువాత కొత్తగా నిర్మించిన వరంగల్‌ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవన సముదాయాలను ప్రారంభించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “త్వరలో మామునూర్‌కి విమానాశ్రయం రాబోతోంది. వరంగల్‌ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్‌ రూరల్ జిల్లా పేరును వరంగల్‌ జిల్లాగా మార్చుతాము. వరంగల్‌ సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించబోతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణపనులు ఏడాదిన్నరలోగా పూర్తవ్వాలి. మళ్ళీ నేనే వచ్చి ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తాను. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధులు, ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయసహకారాలు అందజేస్తాం. కనుక జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేకశ్రద్ద తీసుకొని ఆలోగా పనులు పూర్తయ్యేలా చూడాలి.

ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రి చాలా పాతబడిపోయినందున దానిని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక వసతి సౌకార్యాలతో కొత్త భవనం నిర్మించి దానిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేద్దాం. నగరానికి ఒక డెంటల్ కాలేజీని, దానికి అనుబందంగా ఓ డెంటల్ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నాను.

విద్యా, వైద్య, సాంకేతిక, ఐటీ రంగాలలో వరంగల్‌ నగరం హైదరాబాద్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దుతాము. వరంగల్‌ నగరంలో మౌలికవసతులను మరింత అభివృద్ధి చేసుకొందాం. హైదరాబాద్‌ తరువాత రాష్ట్రంలో వరంగల్‌ నగరం రెండో స్థానంలో నిలువబోతోంది. నగరం అభివృద్ధి చెందుతున్నకొద్దీ జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక దేవాదుల ప్రాజెక్టులోని నీళ్ళు మొత్తం వరంగల్‌ నగరానికే కేటాయించాలని నిర్ణయించాం. గతంలో భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారు కానీ ఇప్పుడు కలెక్టర్లు భూమి శిస్తు వసూలు చేయడం లేదు కనుక వారి పదవికి, హోదాకు తగినట్లుగా కొత్త పేరు ఇవ్వాలనుకొంటున్నాము. జూలై 1 నుంచి 10 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మూడూ కలిపి ఒకేసారి చేపడదాం,” అని అన్నారు.