
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. సాయంత్రం 5 గంటలకు దుకాణాలు, కార్యాలయాలు షాపింగ్ మాల్స్ వగైరా అన్నీ మూసివేయవలసి ఉంటుంది. ప్రజలు ఇళ్ళు చేరుకొనేందుకు వీలుగా సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది. అయితే నేటికీ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం యధాప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఇచ్చింది.ఆ ఒక్క జిల్లా మినహా ఏపీ అంతటా సాయంత్రం 6 నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈనెల 21 నుంచి 30 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
అయితే అత్యవసర సేవలు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. కర్ఫ్యూ సడలింపు సమయం పెంచినందున ప్రభుత్వోద్యోగులు అందరూ ఈ నెల 21 నుంచి విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 21 నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధా ప్రకారం పని చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్డౌన్ సడలించినందున, రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఉద్యోగ, వ్యాపార రీత్యా నిత్యం రాకపోకలు సాగించేవారికి ఇప్పుడు కాస్త సౌకర్యంగా ఉంటుంది.