
రెండేళ్ల క్రితం జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. వాటిలో మౌలికవసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ నాడు-నేడు అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దాని కోసం వేలకోట్లు నిధులు ఖర్చు చేస్తోంది. కనుక నాడు-నేడులో జరుగుతున్న పనులు, వాటి కోసం చేస్తున్న ఖర్చులు అన్నిటినీ పూర్తి పారదర్శకంగా, అవినీతిరహితంగా నిర్వహించేందుకు జగన్ సర్కార్ టీసీఎస్ కంపెనీతో ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ రూపొందించుకొని దానిలో ఆ వివరాలను నమోదు చేస్తోంది.
ఇది సత్ఫలితాలు ఇస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమం అమలుచేయాలని నిర్ణయించింది. దీని కోసం ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడుకొనేందుకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు ఓ లేఖ వ్రాశారు. దానిపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడుకొనేందుకు నో-అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అంగీకరించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఉపయోగపడే ఏ పనికైనా తన ప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉంటుందని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.