ఈటలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేవరయంజాల్ భూములపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీని కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరుతూ ఈటల కుటుంబం తరపు దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం భావిస్తే కమిటీని నియమించి విచారణ జరిపించవచ్చని దానిని తప్పు పట్టడానికి లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కమిటీని నియమిస్తే పిటిషనర్లకు ఇబ్బంది ఎందుకని ప్రశ్నించింది.

ప్రభుత్వాధికారులు సర్వే, విచారణ సాకుతో తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు తమ భూములలోకి అక్రమంగా జొరపడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించగా, పిటిషనర్లకు తగినంత సమయం ఉండేలా ముందుగా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఈటలకు చెందిన వ్యక్తులు విచారణాధికారులను ఆ ప్రాంతంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకొంటున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదించగా, ఒకవేళ పిటిషనర్లు విచారణకు సహకరించకపోతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేసింది.

అసైన్డ్ భూముల కబ్జాపై విచారణను కొనసాగించనీయడం, విచారణాధికారులకు తప్పనిసరిగా సహకరించాలని ఈటలను హైకోర్టు ఆదేశించడం రెండూ కూడా ఆయనకు పెద్ద ఎదురుదెబ్బలే. అయినా తాను ఎవరి భూములు ఆక్రమించుకోలేదని వాదిస్తున్న ఈటల రాజేందర్‌, వాటిపై విచారణకు సహకరించి తన నిజాయితీని నిరూపించుకొనే బదులు, విచారణ జరపకుండా నిలిపివేయాలని ఎందుకు కోరుకొంటున్నారు? అంటే అర్ధం ఏమిటి?