
సిఎం కేసీఆర్ మొన్న ఆదివారం ప్రగతి భవన్లో 32 జిల్లాల అదనపు కలెక్టర్లకు కియా కార్లను అందజేశారు. ఒక్కోటి రూ.25-30 లక్షల చొప్పున మొత్తం రూ.10-11 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32 కార్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నిన్న గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, “కరోనా, లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెపుతూ ఓ పక్క భూములు అమ్ముకొని ఆదాయం సమకూర్చుకొనే ప్రయత్నాలు చేస్తూ, మరో పక్క ఈవిదంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ కరోనా కష్టకాలంలో ప్రాధమిక వైద్య సౌకర్యాలకు, ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు వెనకాడుతున్న ప్రభుత్వం ఒకేసారి 32 విలాసవంతమైన కార్లను కొనుగోలుచేయడం బాధ్యతారాహిత్యమే. ప్రభుత్వ అధీనంలో వేలాదికార్లు ఉండగా మళ్ళీ కొత్తగా 32 కార్లను కొనవలసిన అవసరం ఏమిటి?
ఈవిదంగా వృధాఖర్చులు చేయడం వలననే కేవలం ఏడేళ్ళలో మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రూ.4 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మవద్దంటూ ధర్నాలు చేసిన కేటీఆర్, ఇప్పుడు స్వయంగా ఎందుకు అమ్ముతున్నారు?” అని ప్రశ్నించారు.