
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతుండటంతో ఈనెల 20వ నుంచి లాక్డౌన్ కేవలం రాత్రిపూటకే పరిమితం చేయవచ్చునని తాజా సమాచారం. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లు, సినిమా హాల్స్, వ్యాయామశాలలు వగైరా అన్నిటినీ ప్రభుత్వం సూచించిన విదంగా కరోనా జాగ్రత్తలు పాటించాలనే షరతులతో అనుమతించనున్నట్లు తెలుస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాల్స్ నడిపించుకొనేందుకు అనుమతించనున్నట్లు సమాచారం.
ఒకవేళ లాక్డౌన్ మరింత సడలిస్తే ఆర్టీసీ, మెట్రో సర్వీసులు మళ్ళీ పూర్తిస్థాయిలో నడుస్తాయి. కానీ అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులపై విధించిన నిషేధం మరికొంత కాలం కొనసాగవచ్చు. ఈ-పాస్ అమలుపై విమర్శలు, పిర్యాదులు వెల్లువెత్తుతున్నందున దానిని నిలిపివేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ జూన్ 19తో ముగియనుంది. అదీగాక ఈనెల 20,21 తేదీలలో సిఎం కేసీఆర్ సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కనుక ఆలోగానే లాక్డౌన్ సడలింపులపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.