యాదాద్రి జిల్లా కలెక్టర్‌ బదిలీ

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌పై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పధిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనితా రామచంద్రన్‌ను బదిలీ చేసినప్పటికీ ఆమెకు వెంటనే పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆమె పనితీరు పట్ల సిఎం కేసీఆర్‌ అసంతృప్తిగా ఉన్నారా లేక ఆమెకు వేరేదైనా కీలక పదవీ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారా? అనే చర్చ సాగుతోంది. 2016, అక్టోబరులో యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా కలెక్టరుగా కొనసాగుతున్న అనితా రామచంద్రన్‌ జిల్లాను చాలా అభివృద్ధి చేశారని మంచిపేరు సంపాదించుకొన్నారు. అందుకే మిగిలిన ఐఏఎస్ అధికారులందరినీ ప్రభుత్వం బదిలీలు చేస్తున్నప్పటికీ అనితా రామచంద్రన్‌ను మాత్రం ఇప్పటి వరకు అక్కడే కొనసాగించింది. కనుక ఇప్పుడు ఆమెకు ఏ పదవీ బాధ్యతలు అప్పగించబడతాయో చూడాలి.      

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టరుగా బాధ్యతలు చేపడుతున్న పమేలా సత్పధి 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె వరంగల్ నగర అభివృద్ధికి గట్టిగా కృషి చేశారు. ఎటువంటి వివాదాలకు తావీయకుండా మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.