
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొద్దిసేపటి క్రితం బిజెపిలో చేరారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్
చుగ్ సమక్షంలో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాల్యంలో ఈటల కాషాయ కండువా కప్పుకొని పార్టీలో
చేరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ
ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, టీఎస్‌ఆర్టీసీ నేత అశ్వథామా రెడ్డి, ఉస్మానియా ఐకాస
నేతలు కలిపి సుమారు 20 మంది బిజెపిలో చేరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్,
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి
అరవింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యే
రఘునందన్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ అభివృద్ధిలో
ఈటల రాజేందర్ సేవలను కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తరువాత తెలంగాణ రాష్ట్రంలో
బిజెపి అధికారంలోకి రాబోతోందని అన్నారు.
ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, “మమ్మల్ని బిజెపిలోకి సాధారంగా ఆహ్వానించినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు
తెలుపుకొంటున్నాను. అలాగే నాతో పాటు బిజెపిలో చేరిన నా సహచరులందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు
అనుకూలమైన పరిస్థితులున్నట్లు పార్టీ అధిష్టానం భావిస్తోంది. కనుక మేము కూడా రాష్ట్రంలో
పార్టీని బలోపేతం చేస్తూ ఆ దిశలో ముందుకు సాగుతాము. రాష్ట్రంలో చాలా మంది బిజెపిలో
చేరనున్నారు,” అని అన్నారు.
ఈరోజు సాయంత్రం ఈటల రాజేందర్ కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసిన తరువాత లేదా రేపు మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి చేరుకొంటారు.