
వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్ తెలిపారు. నిన్న ప్రగతి భవన్లో మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, వివిద శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించబోయే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అన్ని అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో నిర్మించాలి. అత్యవసర పరిస్థితులలో రోగులను హెలికాప్టర్లో తీసుకువచ్చేందుకు వీలుగా ఈ భవనంపై హేలీ ప్యాడ్ కూడా నిర్మించాలి. అలాగే సహజసిద్దమైన గాలి, వెలుతురు కోసం ఈ భవనాన్ని పర్యావరణహితమైన గ్రీన్ బిల్డింగ్‌గా నిర్మించాలి. కెనడాలో ఇటువంటి ఆసుపత్రిని నిర్మించారు. కనుక అధికారులు కెనడా వెళ్ళి ఆ భవనాన్ని పరిశీలించి, దానికి సంబందించి పూర్తివివరాలను సేకరించాలి. ఈనెల 21వ తేదీన వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంఖుస్థాపన చేస్తాను,” అని చెప్పారు.