ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి

ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ మిగిలినవారిని వెనక్కి తిప్పి పంపుతుండటంతో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో హైదరాబాద్‌లో స్థిరపడినవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొనేవారు ఇంకా పలువురు సొంత వాహనాలలో హైదరాబాద్‌కు బయలుదేరగా రామాపురం చెక్ పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొన్నారు. వారిలో ఈ-పాసులు ఉన్న 700 మందిని మాత్రమే అనుమతించి 1,500 మందిని వెనక్కు తిప్పి పంపారు. దీంతో ఏపీ నుంచి వస్తున్న ప్రజలకు, తెలంగాణ పోలీసులకు మద్య వాగ్వాదాలు జరిగాయి. ఈ-పాసుల విధానం చాలా రోజుల నుండి అమలుచేస్తుండటంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజలు తీవ్ర ఆగ్రహం, అసహనంతో పోలీసులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. దీంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న ఆదివారం కావడంతో భారీగా జనాలు వాహనాలలో తరలిరాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో రామాపురం చెక్ పోస్టు వద్ద జాతీయ రహదారిపై మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. 

లాక్‌డౌన్‌, కర్ఫ్యూ సమయంలో అనుమతించకపోతే ఎవరూ తప్పు పట్టరు కానీ సడలింపు వేళల్లో కూడా ఈ-పాసులు ఉంటే తప్ప రాష్ట్రంలోకి ఎవరినీ అనుమతించకపోతే మళ్ళీ న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ప్రభుత్వాలకు మొట్టికాయలు వేయడం ఖాయం.