
మాజీ మంత్రి, ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా తన అనుచరులతో కలిసి ఇవాళ్ళ ఉదయం గన్‌పార్క్ వద్దకు వెళ్ళి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఇచ్చిన ఆ లేఖలో ‘నేను శాసనసభలో నా స్థానానికి రాజీనామా చేస్తున్నాను,” అని ఒకే ఒక వాక్యం వ్రాసారు. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజీనామా, బిజెపిలో చేరడం ఊహించే కానీ దీంతో ఖరారు అయ్యింది.
రాజీనామా చేసిన తరువాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌లో 17 ఏళ్ళపాటు ఎమ్మెల్యేగా ఉన్నాను. సిఎం కేసీఆర్ నాకు బీ ఫారం ఇచ్చి ఉండవచ్చు కానీ నన్ను ఆశీర్వదించి గెలిపించింది మాత్రం ప్రజలే. ఇప్పుడు వారి ఆశీర్వాదంతోనే పోరాడబోతున్నాను. తెలంగాణ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసం సిఎం కేసీఆర్‌తో పోరాడుతాను. ఆయన వద్ద అక్రమంగా సంపాదించిన వందల కోట్లు డబ్బు ఉంది. దానిని వెదజల్లి ఉపఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్తారని నాకు తెలుసు. అయితే ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో టిఆర్ఎస్‌ను ఓడించి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం నిలబెడతాను,” అని అన్నారు.