తెలంగాణ రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో సహా రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలందరూ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తరువాత వారందరూ కలిసి శామీర్‌పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. సుమారు అర్ధగంటసేపు వారి సమావేశం కొనసాగింది.
అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించేందుకే వచ్చాము. ఆయన సోమవారం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మాపార్టీలో చేరనున్నారు. కోట్లాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం ప్రజల కొరకు కాక కేసీఆర్ కుటుంబం కోసమే అన్నట్లు మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం తన లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు అన్నీ మరిచిపోయింది. అది గుర్తు చేసినందుకే ఈటల రాజేందర్‌ను పదవి నుంచి తప్పించినట్లు మేము భావిస్తున్నాము. తెలంగాణ అభివృద్ధి, హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో కలిసివచ్చే ఈటల రాజేందర్ వంటి వారినందరినీ కలుపుకొని ముందుకు సాగుతాము,” అని అన్నారు.
ఈటల రాజేందర్ నివాసానికి వెళ్ళినవారిలో రాష్ట్ర బిజెపి నేతలు లక్ష్మణ్, రాజాసింగ్, రఘునందన్ రావు, రామచంద్రరావు, సోయం బాపూరావు, వివేక్, డికె.అరుణ తదితరులున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హోం క్వారెంటైన్‌లో ఉండటంతో వెళ్లలేకపోయారు.