.jpg)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ర్యాలీగా వెంట తరలివచ్చారు. ఈటల మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమాలకు పిడికిలి బిగించి సింహగర్జన చేసినట్లే ఈనాడు హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, బడుగుబలహీన వర్గాలవారి హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్దమవుతోంది. నా రాజీనామాతో హుజూరాబాద్‌లో నియోజకవర్గంలో ధర్మానికి, అధర్మానికి మద్య కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగబోతోంది. దానిలో ధర్మమే గెలుస్తుంది. టిఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్కు ఓటమి తప్పదు...సిఎం కేసీఆర్ గద్దె దిగక తప్పదు. ఆయన తొత్తులు కొంతమంది ఇక్కడ నా నియోజకవర్గంలో గొర్రెల మందపై తోడేళ్ళు పడినట్లు నా అనుచరులు, చిరకాలం టిఆర్ఎస్ జెండా మోసినోళ్లపై పడి భయబ్రాంతులను చేస్తున్నారు. సిఎం కేసీఆర్ అక్రమంగా సంపాదించిన వందల కోట్ల సొమ్మును పంచిపెట్టి ప్రజలను, నా అభిమానులను కొనాలని ప్రయత్నిస్తున్నారు. కానీ టిఆర్ఎస్ ఎంత సొమ్ము పంచినా, ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా వారందరూ నా వైపే ఉంటారు. ధర్మాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపిస్తారు,” అని టిఆర్ఎస్ను హెచ్చరించారు.