జూన్‌ నుంచి పీఆర్సీ వేతనాలు చెల్లింపు?

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)ని ఈ నెల నుంచి అమలుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచే పీఆర్సీని అమలుచేయవలసి ఉన్నప్పటికీ కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఇంతవరకు చేయలేదు. దీంతో ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీలైతే ఏప్రిల్, మే, జూన్‌ నెలలకి చెల్లించవలసిన పెంచిన జీతాలను కలిపి జూలై జీతాలలో చెల్లించడమా లేక జూన్‌ నెలది మాత్రమే చెల్లించి, ఏప్రిల్, మే నెలల పీఆర్సీని రెండు లేదా మూడు వాయిదాలలో చెల్లించడమా?అనే దానిపై నేడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని నిర్ధిష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ఉద్యోగుల జీతాలు పీఆర్సీని అమలుచేయాలంటే నెలకు రూ.1,000 కోట్లు చొప్పున ఏడాదికి రూ.12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆర్ధికశాఖ అంచనా వేసింది. ప్రభుత్వోద్యోగులతో పాటు ఉపాద్యాయులు, హోంగార్డులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది తదితరులకు కూడా జీతాలు పెంచుతామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. కనుక వారూ జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారికీ జీతాల పెంచాలంటే ప్రభుత్వంపై మరింత అదనపు భారం పడుతుంది కనుక వారి జీతాల పెంపుపై కూడా నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.