దీక్షలకీ కరోనా ఎఫెక్ట్

కరోనా మహమ్మారి జనాల జీవితాలలో...వారి జీవనశైలిలో చాలా మార్పులు తెచ్చింది. కరోనాకు రాజకీయ నాయకులు అతీతులు కారు కనుక వారి రాజకీయ వ్యవహారాలలో కూడా చాలా మార్పులు తెచ్చింది. గతంలో మీడియా సమావేశాలు పెట్టి గంటలు గంటలు మాట్లాడే నేతలు ఇప్పుడు ఇళ్లలోనే కూర్చొని జూమ్ యాప్ ద్వారా చెప్పదలచుకొన్నవి క్లుప్తంగా చెపుతున్నారు. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున 24-36 గంటల దీక్షలను 3-4 గంటలకు కుదించి, మాస్కులు ధరించి ‘మినీ దీక్షల’తో సరిపెట్టుకొంటున్నారు. అందుకు తాజా ఉదాహరణగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రస్తుతం గాంధీభవన్‌లో చేస్తున్న 4 గంటల సత్యాగ్రహ దీక్ష గురించి చెప్పుకోక తప్పదు. 

కరోనా, బ్లాక్ ఫంగస్‌ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. కరోనా సమస్యలపై ప్రజలకు అండగా నిలవాలని తమ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈ దీక్షకు పూనుకొన్నారు. ఈ దీక్షలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.