రేవంత్‌ రెడ్డికే పిసిసి అధ్యక్ష పదవి?

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, వి.హనుమంతరావు, రేవంత్‌ రెడ్డి వంటి పలువురు సీనియర్ నేతలు పోటీ పడినప్పటికీ చివరికి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేయబోతునట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం చెలరేగింది. దాంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు ముగిసేవరకు అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని సీనియర్ నేతల అభ్యర్ధన మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటివరకు ఆగింది. కానీ మళ్ళీ రేవంత్‌ రెడ్డికే పిసిసి పగ్గాలు కట్టబెట్టాలని నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీలోకి తీసుకొని జీవన్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ ఆలీలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులలో తెలంగాణ పిసిసికి కొత్త అధ్యక్షుడి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.

రేవంత్‌ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని పార్టీలో చాలామంది సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్‌ రెడ్డికి ఆ పదవి ఇస్తే తాము పార్టీ విడిచి పెట్టి వెళ్లిపోతామని కొందరు నేతలు హెచ్చరించారు కూడా అందుకే నాగార్జునసాగర్ ఉపఎన్నికలు వంకతో వాయిదా వేయవలసివచ్చింది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయన వారినందరినీ కలుపుకొని ముందుకు సాగగలరా లేదా పార్టీ నిలువునా చీలిపోతుందా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.