కుక్కినపేనులా ఉండలేదు అందుకే కక్ష కట్టారు: ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు ఉదయం శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌తో రాత్రికి రాత్రి నాకు దూరం పెరుగలేదు. ఐదేళ్ళ క్రితమే మామద్య దూరం మొదలైంది. అందరూ కుక్కిన పేనుల్లా పడి ఉండాలని మీరు (సిఎం కేసీఆర్‌) కోరుకొంటారు కానీ నేను ఆవిదంగా ఉండను కనుకనే నాపై కక్ష పెంచుకొని కుట్ర పన్ని ఈవిదంగా బయటకు పంపించారు. నేను ఏనాడూ మీ కంటే ఎత్తుకు ఎదగాలని కోరుకోలేదు. మీ కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేస్తానన్నా అభ్యంతరం చెప్పలేదు. రైతుబంధు పధకంలో బడాబాబులకు ఇవ్వడం ఎందుకు...అదేదో నిరుపేద రైతులకే ఇవ్వాలని సూచించాను అంతే! దాంతో నేను సంక్షేమ పధకాలను వ్యతిరేకిస్తున్నానని ముద్రవేశారు.

పార్టీలో... ప్రభుత్వంలో మా మాటకు విలువలేకపోయినా... ఎన్నిఅవమానాలు ఎదురైనా అందరం సర్ధుకుపోతూ బానిసల్లానే బ్రతికాము తప్ప ఏనాడూ మిమ్మల్ని ఎదిరించలేదు. మంత్రిగా ఉన్న నన్నే ప్రగతి భవన్‌ గేటు దగ్గర నుంచి వెనక్కు తిప్పి పంపించేశారు. మంత్రి హరీష్‌రావుకు సైతం ఈ అవమానాలు తప్పలేదు. మంత్రులు లేకుండానే ఆయా శాఖల అధికారులతో మీరు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అన్ని నిర్ణయాలు మీరే తీసుకొంటున్నప్పుడు ఇంక మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు? ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరిపై మీకు నమ్మకం లేనప్పుడు 4 కోట్ల మంది ప్రజలపై మీకు నమ్మకం ఉంటుందా? 

ఆనాడు మీరు టిఆర్ఎస్‌ పెట్టి ఒంటరిగా పోరాటం మొదలుపెట్టినప్పుడు మీకు అండగా నిలబడి మీపై విమర్శలు చేస్తున్నవారితో కొట్లాడిన నావంటి వారినందరినీ మెల్లమెల్లగా బయటకు పంపించేశారు. ఆనాడు మిమ్మల్ని తరిమికొట్టాలని అన్నవాళ్ళను చంకనెక్కించుకొన్నారు. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారు. అయితే ఈవిదంగా ఇక ఎంతో కాలం సాగదని గుర్తుంచుకోండి,” అంటూ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు.