విదేశీ వాక్సిన్లకు కేంద్రం లైన్ క్లియర్...కానీ నో స్టాక్!

విదేశీ వాక్సిన్ల దిగుమతిపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలన్నిటినీ తొలగిస్తున్నట్లు డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) చీఫ్ వీజీ సోమానీ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన విదేశీ వాక్సిన్లతో పాటు అమెరికా, యూకె, జపాన్ తదితర దేశాలు ఆమోదించి వినియోగిస్తున్న వాక్సిన్లకు కూడా భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌ అవసరం లేదని నేరుగా ప్రజలకు పంపిణీ చేయవచ్చునని తెలిపారు. దేశంలో వాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సోమానీ తెలిపారు. వాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి దరఖాస్తు చేసుకొంటే తక్షణమే ఆమోదించి రాయితీలు కూడా ఇస్తామని తెలిపారు. దీంతో అతి త్వరలోనే భారీగా విదేశీ వాక్సిన్లు భారత్‌కు దిగుమతి లేదా భారత్‌లో ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నామని సోమాని తెలిపారు. 

కానీ అనేక దేశాలకు కోట్లాది వాక్సిన్లు సరఫరా చేస్తున్న ఫైజర్, మోడెర్నా కంపెనీలు, భారత్‌కు వాక్సిన్లు అందించడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని చెప్పినట్లు సమాచారం. 

నిజానికి డీసీజీఐ ఈ నిర్ణయం ఆర్నెల్ల క్రితమే తీసుకొని ఉండి ఉంటే నేడు దేశంలో వాక్సిన్ల కొరత ఏర్పడి ఉండేది కాదు. కానీ దూరదృష్టి లేకపోవడం వలన సీరం, భారత్‌ బయోటెక్ కంపెనీలపై నమ్మకం పెట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చొని, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. దేశాన్ని పాలిస్తున్న కేంద్రప్రభుత్వంలో, డీసీజీఐలో అనేకమంది మేధావులు, నిపుణులు ఉన్నప్పటికీ భారత్‌ వాక్సిన్ విధానం ఇంత ఘోరంగా ఎందుకు ఉందో వారే చెప్పాలి.