
రాష్ట్రంలో కరోనా కేసులపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుదవారం విచారణ చేపట్టినప్పుడు కరోనా చికిత్స పేరుతో రోగులను నిలువునా దోచుకొంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలలో అటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపై కటిన చర్యలు తీసుకోవడమే కాక రోగుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో సహా భారీ జరిమానాలు విధిస్తున్నాయని కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆసుపత్రులకు కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసి చేతులు దులుపుకొంటోందని ధర్మాసనం ఆక్షేపించింది.
ప్రైవేట్ ఆసుపత్రులలో మందులు, చికిత్సకు సంబందించి ఛార్జీలను నిర్ధారిస్తూ 48 గంటలలో ప్రభుత్వం జీఓ జారీ చేయాలని తాము గత నెలలలో ఆదేశించామని కానీ ఇంతవరకు జీవో జారీ చేయలేదూ కనుక దీనిని కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో తెలపాలని ధర్మాసనం ప్రశ్నించింది. మళ్ళీ తదుపరి విచారణ చేపట్టేలోగా ప్రభుత్వం జీఓ జారీ చేసి ఆ కాపీని హైకోర్టుకు సమర్పించాలని లేకుంటే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టుకు రప్పిస్తామని హెచ్చరించింది.
ఈ సందర్భంగా హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. మూడో దశ కరోనా వస్తే ఎదుర్కొనేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తోందని ప్రశ్నించింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స చేసేందుకు ఎటువంటి వైద్య సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించింది. దారిద్యరేఖకు దిగువనున్న పేదప్రజలను ఆదుకోవడానికి ఏం చర్యలు చేపట్టిందని ప్రశ్నించింది. ఆసుపత్రులలోని మానసిక రోగులు, వృద్ధాశ్రమాలలోని వృద్ధులు, జైళ్లలోని ఖైదీలు రోడ్డుపై జీవించే యాచకులు, అనాధలు తదితరులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
హైకోర్టు విచారణకు వర్చువల్ విధానంలో హాజరైన ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కటిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. మొదటిదశ కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రోగులకు రూ.3 కోట్లు, ఈ రెండో దశలో ఇప్పటివరకు కోటి రూపాయలు వాపసు ఇప్పించామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అయినా తీరు మార్చుకోనివాటి లైసెన్సులు రద్దు చేస్తున్నామని తెలిపారు. కరోనా, బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్స చేసిన ఏర్పాట్ల గురించి హైకోర్టుకు వివరింకహరు. ఈకేసు తదుపరి విచారణ జూన్ 10వ తేదీకి వాయిదా పడింది.