
కరోనా నివారణకు ఆనందయ్య తయారుచేసి ఇస్తున్న ఆయుర్వేద మందు వినియోగానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే కంట్లో వేసే చుక్కల మందుకు సంబందించి ఇంకా నివేదిక రానందున దాని వినియోగించరాదని సూచించింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం ఆనందయ్య మందులతో కరోనా తగ్గుతుందని చెప్పలేమని కానీ అవి హానికరం కావు కనుక వాటి తయారీ, పంపిణీకి అనుమతిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పీ,ఎల్,ఎఫ్, కె(కంట్లో వేసే చుక్కల మందు) పేరిట నాలుగు రకాల ఆయుర్వేద మందులు తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆయనకు ఎటువంటి వైద్య సంబందిత డిగ్రీలు, అర్హతలు లేవు. తన తాతగారి వద్ద నుంచి వంశపారంపర్యంగా ఆయుర్వేద మందుల తయారీని నేర్చుకొని ఉచితంగా ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు. ఆ మందులపై తయారీ, ఫలితాలపై నిపుణుల బృందంతో విచారణ జరిపించిన ఏపీ ప్రభుత్వం అవి ప్రమాదరహితమని నిర్దారించుకొని కంట్లో వేసే చుక్కల మందు తప్ప మిగిలినవాటి పంపిణీకి ఆమోదం తెలిపింది.
ఆనందయ్య మందులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఈరోజే ఆయన మందులను వాడి కోలుకొన్న కోటయ్య అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ నెల్లూరులో లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో చనిపోయారు. ఇవాళ్లే ఏపీ హైకోర్టులో ఆనందయ్య మందుల వినియోగంపై విచారణ కూడా జరుగుతోంది.