రేపటి నుంచి టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఆదివారం నుంచి మూడు రోజులపాటు టీకాలు వేయబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. దీని కోసం ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖలు వెంటనే ఏర్పాట్లు మొదలుపెట్టాయి. 

టీఎస్‌ఆర్టీసీ సిబ్బందితో సహా రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు నడుపుకొని జీవనం సాగించేవారు, ఇంటింటికీ తిరిగే గ్యాస్ డెలివరీ బాయ్స్ తదితరులు కూడా కరోనా బాధితులుగా మారుతున్నారు. ఇటీవల కరోనా రోగులు లేదా ఆ లక్షణాలున్నవారు కూడా ఆటోలు, బస్సులలో తిరుగుతుండటంతో ఆటోలు, క్యాబ్‌, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా బారిన పడుతూ తమకి తెలియకుండానే ఇతరులకి కూడా వ్యాపింపజేస్తున్నారు. నిజానికి వీరికి కూడా మొదటే ప్రాధాన్యం ఇచ్చి టీకాలు వేసి ఉండాల్సింది కానీ కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల వలన అది సాధ్యం కాలేదు. ఇప్పుడు టీకాల విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు కొంత స్వేచ్చనివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వీరందరినీ సూపర్ స్పైడర్స్‌గా గుర్తించి శుక్రవారం నుంచి టీకాలు వేస్తోంది. ఇది చాలా సరైన నిర్ణయమని చెప్పవచ్చు.