
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గురువారం నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా దీనిని దాఖలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఎంపీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా, టిడిపి మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ, జెరూసలేం మట్టయ్యాలను నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో నిందితులను ప్రాసిక్యూట్ చేసేందుకు విచారణ చేపట్టవలసిందిగా న్యాయస్థానాన్ని ఈడీ కోరింది.
2015 ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ రేవంత్ రెడ్డి, కృష్ణ కీర్తన్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నివాసానికి వెళ్ళి రూ.50 లక్షలు నగదు లంచం ఇస్తుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ కేసులో నిందితులకు వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాధారాలున్నప్పటికీ బహుశః రాజకీయ కారణాలతో నేటికీ ఆ కేసు నత్త నడకన సాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ పూర్తవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలీదు.