
కరోనా కట్టడిలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్రంలోని జూ.డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీర్గకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 10వ తేదీన తాము రాష్ట్ర వైద్యవిద్యా డైరెక్టర్ రమేష్ రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చి అప్పటి నుంచి నల్ల బ్యాద్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలియజేశామని, కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె చేయక తప్పడం లేదని జూ.డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు వాసరి నవీన్, స్వరూప్, విజయ్ చెప్పారు. నేటి నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 19న సిఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శించినప్పుడు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని తమకు హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం తమను తీవ్ర నిరాశపరిచిందని అన్నారు.
నేటి నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ సమ్మె మొదలుపెట్టారు. ఇవాళ్ళ ఒక్కరోజు ఐసీయూ సేవలు, అత్యవసర సేవలకు హాజరవుతామని రేపటి నుంచి కోవిడ్, సాధారణ ఆసుపత్రులలో అన్ని రకాల సేవలను బహిష్కరించి సమ్మె చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా చికిత్సకు ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు కనుక సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించుకొంటున్నారు. ఈ పరిస్థితులలో జూ.డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో కోవిడ్, నాన్-కోవిడ్ ఆసుపత్రులలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
ఇటువంటి క్లిష్ట సమయంలో రోగుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే సమ్మె చేయడాన్ని ఎవరూ హర్షించరు. అలాగే తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా పరిస్థితిని ఇంతవరకు వచ్చేలా చేయడం కూడా సరికాదనే చెప్పాలి.