అన్నపూర్ణ లాంటి సీతక్క...

ఈ కరోనా..లాక్‌డౌన్‌ కష్టకాలంలో అడిగినా పట్టెడు అన్నం పెట్టేవారు లేరు. కానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ములుగు జిల్లాలో గ్రామాలలో పర్యటిస్తూ అక్కడి నిరుపేద గిరిజన ప్రజలకు ఆహారం పోట్లాలు పంచిపెట్టారు...అనేకమందికి నిత్యావసర సరుకులు ప్యాకెట్లు అందజేశారు. ములుగు మండలం కాసిందేవిపేటలో పర్యటించి అక్కడి గ్రామస్తులకు ఆక్సీమీటరుతో ఆక్సిజన్‌ లెవెల్స్ పరీక్షించి తక్కువ ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీతక్క గ్రామాలలో పర్యటిస్తూ కరోనా వైరస్ లక్షణాలు, ఆ వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆ వ్యాధి సోకితే ఎవరిని సంప్రదించాలి...వంటి అనేక విషయాల గురించి గ్రామీణులకు అర్ధమయ్యేలా వివరించి చెప్పారు. 



అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కరోనాతో నిరుపేద ప్రజలు అల్లాడిపోతున్నారు. వారికి కూడా మంచి వైద్యం అందించేందుకు కరోనాకు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్నా పట్టించుకోవడం లేదు. సిఎం కేసీఆర్‌ ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బు పోగొట్టుకోవద్దు...సర్కార్ దవాఖానాలకు వెళ్ళమని చెపుతున్నారు. కానీ ఆయనకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినప్పుడు సర్కార్ దవఖానాలకు పోకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు వెళ్ళారు?వారికి పౌష్టికాహారం, కార్పొరేట్ ఆసుపత్రులలో మంచి వైద్య చికిత్స అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ ఈ మారుమూల గ్రామాలలో ప్రజలకు కనీసం తిండి లేక నానా బాధలు పడుతున్నారు. ప్రభుత్వం ఒక్కో గిరిజన కుటుంబానికి కనీసం నెలకు రూ.1,500 చొప్పున సాయం చేయాలని కోరుతున్నాను. జిల్లాలోని ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్లు, సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను,” అని అన్నారు.