ఈ-పాస్ ఉన్నవారికే తెలంగాణలోకి అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో కటినంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుచేయాలని సిఎం కేసీఆర్‌ పోలీస్ శాఖను ఆదేశించడంతో ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై వాహనాలపై తిరుగుతున్నవారిని ఎక్కడికక్కడ కొన్ని గంటలు సేపు నిర్బందించి గట్టి హెచ్చరికలు చేసి విడిచిపెట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ-పాస్ లేకుండా తిరిగితే కటిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. 

ఇక ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలు కటినంగా అమలుచేయడంతో జాతీయరహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. శనివారం వరకు ఉదయం 6 నుంచి 10 వరకు ఈ-పాస్ లేకపోయినా వాహనాలను అనుమతించేవారు. కానీ ఆదివారం నుంచి ఈ-పాస్ ఉన్నా కూడా ఉదయం 10 గంటల తరువాత ఎవరినీ అనుమతించడం లేదు. అంబులెన్సులు, అత్యవసరపనులపై వస్తున్నవారిని మాత్రమే అనుమతించారు. 

సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్స్ వద్ద, ఉమ్మడి నల్గొండ జిల్లాలలోని మూడు చెక్ పోస్టుల వద్ద, జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు వద్ద చెక్ పోస్టుల వద్ద పోలీస్ అధికారులే పర్యవేక్షిస్తూ లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలుచేయించారు. దీంతో చాలామంది ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ముందుకు వెళ్ళలేక వెనక్కు తిరిగి వెళ్ళలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు.