1.jpg)
సిఎం కేసీఆర్ మొన్న గాంధీ ఆసుపత్రికి వెళ్ళి వైద్యులు, సిబ్బంది, కరోనా రోగులతో మాట్లాడి వారికి భరోసా కల్పించడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ భిన్నంగా స్పందించారు.
జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ కేవలం ప్రచారం కోసమే గాంధీ ఆసుపత్రికి వెళ్ళినట్లుంది తప్ప అక్కడి సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళినట్లు లేదు. గాంధీ ఆసుపత్రిలో సరైన వసతులు లేవు. సిబ్బంది తక్కువగా ఉన్నారు. వెంటిలేటర్లు పనిచేయడం లేదు. కరోనా రోగులకు చికిత్స చేస్తూ వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చనిపోయారు. ఇంతవరకు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనేలేదు. తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వారికి జీతాలు పెంచలేదు. ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. సరైన సదుపాయాలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ సిఎం కేసీఆర్‌కు కనిపించలేదా?ఈ సమస్యల పరిష్కారానికి ఆయన ఏమైన చర్యలు తీసుకోంటారా లేక కంటి తుడుపు చర్యగా రోగులను పరామర్శించి వచ్చారనుకోవాలా?గాంధీలో సమస్యలు పరిష్కరించకుండానే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి బయలుదేరుతున్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధులతో సామాన్యప్రజలు చాలా సతమతమవుతున్నారు కనుక ఆ రెండు వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము ఎన్నిసార్లు చెప్పినా సిఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఎవరికీ సాంకేతిక విషయాలు తెలియవు. మరి అటువంటి టాస్క్‌ఫోర్స్ వలన ఏమి ప్రయోజనం ఉంటుంది?” అంటూ బండి సంజయ్ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.