రాష్ట్రంలో ఆసుపత్రులకు ప్రభుత్వాదేశాలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బ్లాక్ ఫంగస్ వ్యాధి బయటపడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కింగ్ కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా ప్రకటించి, అక్కడ బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసింది. మొదటి రెండు రోజులలోనే 24 మంది  బ్లాక్ ఫంగస్ రోగులు ఆసుపత్రిలో చేరారు. కనుక హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కడ బ్లాక్ ఫంగస్‌ కేసులు వచ్చినా తప్పనిసరిగా ఆ విషయం వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటి ఆధారంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆ వ్యాధి తీవ్రతను అంచనా వేసి దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయగలుగుతుంది.