
స్పుత్నిక్ వి వాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ పానసియా బయోటెక్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నవీన్ చావ్లాలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం దానిపై విచారణ చేపట్టినప్పుడు ‘కరోనా కట్టడిలో కేంద్రప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇక భారత్‌ను ఆ భగవంతుడే కాపాడాలంటూ..’ఆవేదన వ్యక్తం చేసింది.
దేశంలో మేధావులు, నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా కేంద్రప్రభుత్వం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం లేదని ఆక్షేపించింది. కేంద్రం అలసత్వం వలన లక్షలాదిమంది ప్రజలు కరోనా బారినపడి నలిగిపోతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితుల గురించి తెలుసుకోకుండా కేంద్రప్రభుత్వం భ్రమలో బ్రతుకుతూ ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఓ నిర్ణయం తీసుకొంటే దానిని దిగువస్థాయిలో ఆచరణలో చేపట్టేందుకు అర్ధగంట సమయం చాలని కానీ రోజులూ...వారాలు...నెలల సమయం పడుతోందని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టులు నిత్యం మొట్టికాయలు వేస్తున్నా కేంద్రప్రభుత్వంలో చలనం కలగడం లేదని ఆక్షేపించింది. స్పుత్నిక్ వి వాక్సిన్లను దేశంలో భారీగా ఉత్పత్తి చేసే అవకాశాలను కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. దేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తిపై కేంద్రప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకొందో వారం రోజులలోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.