భూకబ్జాలు చేసి ఈ బెదిరింపులేంది?గంగుల ప్రశ్న

హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ తరపున మంత్రి గంగుల కమలాకర్‌కు ఈటల రాజేందర్‌కు మద్య జరుగుతున్న ఆదిపత్యపోరులో ఇరువురూ పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్నారు. ఈటల తనకు వార్నింగ్ ఇవ్వడంతో గంగుల కమలాకర్‌ కూడా అదే స్థాయిలో తిరిగి హెచ్చరించారు. 

కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అసైన్డ్ భూములు కబ్జా చేసి ఆత్మగౌరవం అంటావు. నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఆ భూములను పేదలకు తిరిగి ఇచ్చేసేయి. ఇంతకాలం అందరం ఒకే పార్టీలో ఉన్నాము కదా అని గౌరవించాము. కానీ నోటికి వచ్చినట్లు వాగితే నీకంటే గట్టిగానే సమాధానం చెప్పగలం. నువ్వు బిడ్డా గిడ్డా...అంటూ బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడేవాళ్ళు లేరు. నేను 1992 నుంచి గ్రేనైట్ బిజినెస్ చేస్తున్నా ఏనాడూ నీలాగ పేదల భూములు లాక్కోలేదు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడావు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిస్తే ఓర్వలేకపోయావు. అందుకే ఉపఎన్నికలలో జరగరానిదేదో జరిగిపోయిందన్నట్లు మాట్లాడుతున్నావు. ఎన్నికలలో నా ఓటమికి కుట్రలు పన్నావు. టిఆర్ఎస్‌లో ఉన్న మేమందరం కేసీఆర్‌ కోసం... ప్రజల కోసమే పనిచేస్తాము తప్ప పదవులు, అధికారం కోసం కాదు. అవి మాకు తృణప్రాయం. నిజానికి హుజూరాబాద్‌లో నీ వెంట ఎవరూ లేరు. ఒక్కడివే ఉన్నావని మరిచిపోయి మాకు సవాళ్ళు విసురుతున్నావు. నువ్వు నా తల మీద వెంట్రుక కూడా పీకలేవు. నువ్వు బీసీలా నటిస్తున్న ఓసీవి. నీ మాటలను హుజూరాబాద్‌ ప్రజలు నమ్మరు,” అని మంత్రి గంగుల కమలాకర్‌ ఘాటుగా బదులిచ్చారు.