కేటీఆర్‌ నేతృత్వంలో కరోనా టాస్క్‌ఫోర్స్‌...తొలి సమావేశం

రాష్ట్రంలో కరోనా చికిత్స, కట్టడికి అవసరమైన మందులు, ఆక్సిజన్‌, వాక్సిన్లు వగైరాల కొనుగోలు, సరఫరాలను పర్యవేక్షించేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో సిఎం కేసీఆర్‌ ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ కార్యదర్శి..కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, బయలాజికల్ నిపుణుడు శక్తి నాగప్పన్‌ సభ్యులుగా ఉన్నారు.

వీరందరూ నిన్న తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌లో మొదటిసారిగా సమావేశమయ్యి రాష్ట్రంలో కరోనా పరిస్థితి, దానిని ఎదుర్కొనేందుకు చేపట్టిన, ఇంకా చేపట్టవలసిన చర్యలు, ఏర్పాట్ల గురించి లోతుగా చర్చించారు. కరోనా కట్టడికి తీసుకొంటున్న చర్యలను మరింత మెరుగు పరుచుకొనే అంశంపై లోతుగా చర్చించారు. కరోనాను ఎదుర్కొంటున్నట్లే కొత్తగా వస్తున్న బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరాను మరింత మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. అలాగే దేశంలో వాక్సిన్ల కొరత ఎక్కువగా ఉన్నందున విదేశాల నుంచి కరోనా వాక్సిన్లను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలవడానికి సాధాసాధ్యాలపై లోతుగా చర్చించారు.