మంత్రులందరూ ఆరోగ్యశాఖ మంత్రులే

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు అనేక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చిస్తూ “మంత్రులు ఎవరి జిల్లాలకు వారు ఆరోగ్యశాఖ మంత్రులుగా వ్యవహరిస్తూ జిల్లాలలో కరోనాను కట్టడి చేయాలి. మీ జిల్లాలలోని ఆసుపత్రులను నిత్యం సందర్శిస్తూ ప్రజలకు వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా లేదా పరిశీలించాలి. ఏవైనా సమస్యలు, లోపాలున్నట్లయితే తక్షణమే పరిష్కరించాలి. ప్రతీరోజు మీ జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. జిల్లాలో మారుమూల ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలకు కూడా మంచి వైద్య సేవలు లభించేలా చేయాలి. మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ ఎల్లప్పుడూ అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సాయపడాలి. మన అందరి లక్ష్యం ఒక్కటే రాష్ట్రం నుంచి కరోనాను తరిమికొట్టడమే. కనుక మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ చొరవ తీసుకొని పనిచేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించాలి,” అని సిఎం కేసీఆర్‌ సూచించారు.