తమిళనాడు కొత్త సిఎం స్టాలిన్ సంచలన నిర్ణయాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టగానే చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో ఈనెల 10 నుంచి 24వరకు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు మద్యం దుకాణాలు తప్ప కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలను తెరిచేందుకు అనుమతించారు. హోటల్స్‌లో పార్సిల్ సర్వీసులకు మాత్రం అనుమతించారు. మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, అత్యవసర సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. 

1. రాష్ట్రంలో కరోనా బారినపడిన పేదలకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున ఆర్ధిక సాయం. ఈనెలలో మొదటి విడతగా రూ.2,000 అందిస్తామని స్టాలిన్ తెలిపారు. 

2. వారికి ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్స పూర్తిగా ఉచితం. ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 

3. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం. 

4. ఆవిన్ ఫెడరేషన్ అధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న పాలను ఈనెల 16 నుంచి లీటరుకు రూ.3 చొప్పున ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.  

5. వంద రోజులలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు “మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి” అనే ఓ కొత్త్ అపధకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం అమలుచేసేందుకు ఓ ఐఏఎస్ అధికారి అధ్వర్యంలో ప్రభుత్వంలో ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రకటించారు.