మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు...దర్యాప్తుకు ఆదేశం

తెలంగాణ ప్రభుత్వంలో, టిఆర్ఎస్‌ పార్టీలో అత్యంత సీనియర్లలో ఒకరైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణలలో చిక్కుకొన్నారు. మెదక్ జిల్లాలోని మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీం పేట గ్రామాలకు చెందిన 8 మంది రైతులు మంత్రి ఈటల రాజేందర్‌ తమ భూములను బలవంతంగా కబ్జా చేశారని, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని నేరుగా సిఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సిఎం కేసీఆర్‌ తక్షణమే విచారణ జరిపించి నివేదిక సమర్పించవలసిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించగా ఆయన ఆదేశాల మేరకు విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు విచారణకు బయలుదేరినట్లు సమాచారం. 

రైతులు అందజేసిన పిర్యాదులో 1994లో అప్పటి ప్రభుత్వం వారికి అసైన్డ్ భూమిని ఇచ్చింది. మంత్రి ఈటల రాజేందర్‌ అనుచరులు అల్లి సుదర్శన్, యండల సుధాకర్ రెడ్డి బెదిరించి, భయపెట్టి బలవంతంగా భూముల పత్రాలను తీసుకుపోయారు. రెండు గ్రామాలలోని సుమారు 100 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన సుమారు 100 ఎకరాలకు సంబందించి అసైన్డ్ భూముల పత్రాలను కూడా వారు తీసుకుపోయారు. వాటిలో మంత్రి ఈటల రాజేందర్‌ పౌల్ట్రీ ఫారంలు నిర్మిస్తున్నారు. గ్రామాలలో మిగిలినవారిని వచ్చి ఇచ్చినంత డబ్బు తీసుకోండి లేకపోతే అవీ మీకు దక్కవని మంత్రి అనుచరులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. అందుకే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, మంత్రి హరీష్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిల ద్వారా సిఎం కేసీఆర్‌కు అందజేశాము. మాకు న్యాయం చేయవలసిందిగా వేడుకొంటున్నామంటూ రెండు గ్రామాలకు చెందిన చాకలి లింగయ్య, బిచ్చవ్వ, నాగులు, కృష్ణ, పరశురాం అనే రైతులు ఫిర్యాదు చేశారు.