
రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేయవలసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టిఎస్పీఎస్సీ)లోనే ఛైర్మన్, సభ్యులను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ జె.శంకర్ అనే ఓ నిరుద్యోగి వేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
టిఎస్పీఎస్సీలో ఒకే ఒక సభ్యుడు మాత్రమే ఎందుకున్నారని, ఛైర్మన్, మిగిలిన సభ్యులను ఇంతవరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఒకవేళ వారిని నియమించదలుచుకోకపోతే టిఎస్పీఎస్సీని మూసివేస్తే మంచిదని హైకోర్టు అంది. ఉద్యోగాల భర్తీలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న టిఎస్పీఎస్సీలో ఛైర్మన్, మిగిలిన సభ్యులు లేకుండా నడిపించడం చాలా దారుణమని అంది. తక్షణమే వారిని నియమించి ఆ వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్‌కు 17కి వాయిదా వేసింది.
రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుస ఎన్నికల సాకుతో నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదు. టిఎస్పీఎస్సీలో ఈ పదవులు ఎలాగూ అసమదీయులకే దక్కుతాయి కనుక కనీసం వాటిని భర్తీ చేసి ఉండాలి. కానీ అదీ చేయకుండా హైకోర్టు చేత చివాట్లు తినేవరకు ఎదురుచూడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.