
కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో నేడు మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాల ఎన్నికలకు నేడు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
హైకోర్టు చివాట్లు, ఆదేశాల నేపధ్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తోంది. పోలింగ్ సిబ్బంది, బందోబస్తులో ఉన్న పోలీసులు, ఓటర్లు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పోలింగ్ కేంద్రాల లోపలా, బయటా కూడా అందరూ భౌతికదూరం పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్ధసారధి ఆయా జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కరోనా జాగ్రత్తలను పర్యవేక్షించేందుకు ప్రతీ పురపాలక సంఘానికి ఇద్దరు చొప్పున ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు.
ఓటర్లకు కరోనా సోకకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకొన్న జాగ్రత్తలపై హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వాటినీ సిద్దం చేస్తోంది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో హైకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. మొట్టమొదటిసారిగా పోలింగ్ కేంద్రాలలో ఆక్సిజన్ సిలెండర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు.