కరోనా నూతన మార్గదర్శకాలు జారీ

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో కరోనా లక్షణాలు కనపడిన తరువాత కరోనా సోకిందా లేదా అని తెలుసుకొనేందుకే రెండు మూడు రోజుల సమయం పడుతోంది. ఆ రిపోర్టులు వచ్చేలోగా సకాలంలో చికిత్స చేయించుకోకపోవడం వలన అనేకమంది ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోతున్నారు. దీనిని గమనించిన కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రకారం అన్ని రాష్ట్రాలు తమ వైద్య విధానంలో మార్పులు చేసుకొని అమలుచేయాలని కేంద్రప్రభుత్వం సూచించింది. 

1. కరోనా లక్షణాలు కనపడగానే పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూడకుండా రోగ లక్షణాలను బట్టి వెంటనే చికిత్స ప్రారంభించాలి. 

2. ఇళ్ళలో ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తగిన సూచనలు, సలహాలు, మందులు అందిస్తూ, పరిస్థితి విషమిస్తున్నట్లయితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 

3. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ అని వచ్చినప్పటికీ కరోనా లక్షణాలుంటే కరోనా సోకినట్లుగానే భావించి వెంటనే చికిత్స ప్రారంభించాలి. 

4. ఇంటివద్ద చికిత్స పొందుతున్న రోగులలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నవారిని గుర్తించి వారికి వెంటనే స్టెరాయిడ్ చికిత్స ప్రారంభించాలి.