పీఆర్సీ అమలయ్యేది ఇంకా ఎప్పుడో?

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం ఎదురుచూపులు ఇప్పట్లో ఫలించేలాలేవు. మొదట కరోనా తరువాత లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించడం, తరువాత వరుసగా ఎన్నికలు...అవన్నీ పూర్తయ్యాయనుకొంటే మళ్ళీ రాష్ట్రంలో కరోనా విజృంభణ....దీంతో పీఆర్సీ అమలయ్యేది ఇంకా ఎప్పుడో తెలీని పరిస్థితి నెలకొంది. 

నిజానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచే 29 శాతం పీఆర్సీ అమలు చేస్తామని సిఎం కేసీఆర్‌ స్వయంగా శాసనసభలో ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల పూర్తికావస్తున్నా ఇంతవరకు పీఆర్సీకి సంబందించి విధివిధానాలను ప్రకటించలేదు. ఆ ముసాయిదా జీవోకు సిఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేయకపోవడంతో ట్రెజరీశాఖ ప్రస్తుత మూలవేతనాల ఆధారంగానే ఉద్యోగుల జీతాల చెల్లింపుకు బిల్లులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఏప్రిల్ నెల జీతాలలో ఎటువంటి పెంపు ఉండకపోవచ్చు. ఒకవేళ ఈనెలాఖరులోగా జీవో జారీ చేసినా దానిని ఏప్రిల్ నెల జీతాలకు వర్తింపజేయాలంటే ఉద్యోగుల జీతాల చెల్లింపు చాలా ఆలస్యం అవుతుంది. కనుక వచ్చే నెల జీతాలకు దానిని వర్తింపజేస్తే ఉద్యోగులు జూన్‌ నెలలో పెరిగిన జీతం అందుకొంటారు. కానీ రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేకనుక జరిగితే పీఆర్సీ సంగతి దేవుడెరుగు మళ్ళీ ఉద్యోగులకు జీతాలలో కోతలు విధించినా ఆశ్చర్యం లేదు.