తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఉత్తమ్‌ ఫిర్యాదు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఓ లేఖ వ్రాశారు. దానిలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంపై  పిర్యాదు చేశారు. ఓ పక్క రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఆయా జిల్లాలలో కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తున్న ఎన్నికల సంఘం ఎన్నికలకు ముందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి వాటి అభిప్రాయం తీసుకొనే ఆనవాయితీని కూడా మరిచిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది కనుక గవర్నర్‌ తక్షణం జోక్యం చేసుకొని మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ అందగానే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.