ఆక్సిజన్ కోసం యుద్ధవిమానాలు!

అవును! ఆక్సిజన్ కోసం యుద్ధవిమానాలు బయలుదేరాయి! వేరే దేశం మీద దాడి చేసి ఆక్సిజన్ తెచ్చేందుకు కాదు పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకువచ్చేందుకు! రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌,  ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఈరోజు ఉదయం స్వయంగా బేగంపేట విమానాశ్రయం నుంచి యుద్ధరవాణా విమానంలో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను భువనేశ్వర్ పంపించారు. అక్కడ అవి ఆక్సిజన్ నింపుకొని తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటాయి. వాటితో సుమారు 14.5 టన్నుల ఆక్సిజన్ వస్తుంది. 


హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ కేంద్రంతో మాట్లాడి ఈ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు సరిపడినంత ఆక్సిజన్ అందించలేకపోయినా యుద్ధరవాణా విమానాన్ని వాడుకొనేందుకు ఇచ్చింది సంతోషం! అయితే ఇటువంటి వినూత్నమైన ఆలోచనలు చేసినందుకు ప్రశంశించాలా లేక ఏడాదిగా కరోనా సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకుండా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు ఆక్సిజన్ విమానాలు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నడిపిస్తునందుకు తప్పు పట్టాలా?