1.jpg)
దేశంలో కరోనా అదుపు తప్పుతుండటం, మరోపక్క ఆక్సిజన్ కొరతతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడికి గురవుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ నేడు తన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకొని, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటలకు ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన తరువాత 10 గంటలకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు.
అధికారులు, ముఖ్యమంత్రులతో సమావేశమైన తరువాత అవసరమైతే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కొన్ని రోజులపాటు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన తరువాత దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.