
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో మంగళవారం రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీరోజు రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కనుక మద్యం దుకాణాలతో సహా అన్నిరకాల దుకాణాలు, హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ అన్నీ రాత్రి 8 గంటలలోగా మూసివేయవలసి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆసుపత్రులు, మందుల దుకాణాలకు, అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతుంటే ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందని హైకోర్టు నిన్న గట్టిగా నిలదీయడమే కాక ఒకవేళ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే తామే ఆదేశాలు జారీచేయవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు హెచ్చరికలు, కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.