
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సొంతజిల్లా కరీంనగర్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఈరోజు ఉదయం హుజూరాబాద్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళుతుండగా దారిలో ఏబీవీపీ కార్యకర్తలు, నిరుద్యోగులు రోడ్డుకి అడ్డంగా బైటాయించి నిరసనలు తెలియజేశారు. తక్షణమే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు కలుగజేసుకొని వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తరువాత మంత్రి ఈటల రాజేందర్ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్ళి అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతున్నందున ఆక్సిజన్ సిలెండర్లకు కొంత కొరత ఏర్పడుతోంది. కానీ ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకొంటున్నాము. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ విధించే ఆలోచనలేదు. కనుక ప్రజలందరూ కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండగలిగితే కరోనా వైరస్ తప్పకుండా నియంత్రణలోకి వస్తుంది,” అని అన్నారు.