.jpg)
సిఎం కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు నిత్యం ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ గత ఐదారేళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి తరచూ ఏదో ఓ జాతీయ అవార్డు లభిస్తూనే ఉండటం ఆయన పాలనకు గీటురాయిగా నిలుస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో జాతీయ అవార్డు అందుకొంది. ఈసారి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు అవార్డు లభించింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది.
దీనికోసం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖలోని ‘ఈ-పంచాయత్’ దేశంలోని గ్రామ పంచాయతీలలో 1. ఎంటర్ ప్రైజ్ 2.సూట్ అప్లికేషన్ 3. స్టేట్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ అనే మూడు విభాగాలుగా విభజించి వీటిలో అత్యున్నతమైన విధానాలు, పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలను ఎంపిక చేసింది. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని సమర్ధంగా వినియోగించుకొంటూ, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం పెంచినందుకుగాను 2019-20 సం.లకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖకు ఈ అవార్డు లభించింది. దేశంలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్టాలు వరుసగా తరువాత స్థానాలలో నిలిచాయి.
తెలంగాణ రాష్ట్రానికి ఈ జాతీయ అవార్డు లభించడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.