
నాగార్జునసాగర్ ఉపఎన్నికల సందర్భంగా ఈరోజు సాయంత్రం హాలియా బహిరంగ సభలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ వెనకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. దాని వలననే తెలంగాణ ప్రాంతమంతా నాశనం అయ్యింది. కె.జానారెడ్డి మంత్రిగా చేశారు కానీ ఆయన తెలంగాణకు...ముఖ్యంగా నల్గొండ జిల్లాకు... ఆయన ప్రాతిధ్యం వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చేసిందేమిటి? నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతుంటే...పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ వారికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదు. మేము మిషన్ భగీరధ ద్వారా నల్గొండకు నీళ్ళు అందించి ఆ సమస్యను రూపుమాపాము.
కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ విద్యుత్ కోతలే కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాము. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు భీమా, రైతు భరోసా... వగైరాలన్నీ అందిస్తూ రైతుల కష్టాలు తీర్చాము. ధరణీతో రైతుల కష్టాలన్నీ తీర్చి వారి భూములపై వారికి సర్వాధికారాలు ఉండేలా చేశాము.
కాంగ్రెస్ హయాంలో నెలకు రూ.200 పెన్షన్ ఇస్తూ అదేదో చాలా గొప్పవిషయంగా చెప్పుకొనేది. మరి అటువంటప్పుడు నెలకు రూ.2,016 ఇస్తున్నప్పుడు మేమెంత చెప్పుకోవాలి. కె.జానారెడ్డి కనీసం ఓ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయలేకపోయారు. కానీ ఇన్ని చేస్తున్న మమ్మల్ని ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పగలరా?
కాంగ్రెస్ నేతలు పదవుల కోసం తెలంగాణకు అన్యాయం చేస్తే, మేము తెలంగాణ కోసం పదవులను వదులుకొని పోరాటాలు చేశాము. కాంగ్రెస్ నేతలకు పదవులమీద ఉన్న ఆసక్తి తెలంగాణ మీద లేదు. వారే సరిగ్గా ఉండి ఉంటే రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేదా?
కనుక సాగర్ ఓటర్లు కె.జానారెడ్డి మాటలు విని అయోమయానికి గురికావద్దు. మనం పళ్ళ చెట్టు నాటితే పళ్ళు కాస్తుంది కానీ ముళ్ళ చెట్టు నాటి పళ్ళు కాయమంటే కాయదు. కనుక ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి మన నోముల నర్సింహయ్య బిడ్డ నోముల భగత్ కుమార్‌కు ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.